అమరావతి: శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మండలి ఛైర్మన్‌ను క్రిస్టియన్‌గా పేర్కొంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు?” అంటూ ప్రశ్నించిన ఆయన, తాను హిందువునని స్పష్టం చేశారు. వ్యక్తిగత మత విశ్వాసాలను రాజకీయ వేదికగా మార్చడం సరికాదని ఆయన సూచించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కూడా తీవ్రంగా స్పందించారు. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
“బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?” – బొమ్మి ఇజ్రాయెల్ విమర్శలు
శాసనమండలి మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
“సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు ఛైర్మన్‌ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో లక్ష్యంగా చేసుకున్నారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అవమానించడం సమంజసం కాదు” అని ఆయన అన్నారు.
అదేవిధంగా, లోకేష్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు జరిగాయని పేర్కొంటూ, “కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీల అంశాలను ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం మత అంశాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
తిరుమల లడ్డూ అంశం కూడా ప్రస్తావన
తిరుమల లడ్డూ అంశంపై చర్చకు రావాలని వారం రోజులుగా కోరుతున్నామని, చర్చను తప్పించుకునే ప్రయత్నం జరిగిందని బొమ్మి ఇజ్రాయెల్ ఆరోపించారు. చివరకు చర్చకు అంగీకరించారని తెలిపారు. చర్చకు మంత్రులు పదేపదే అడ్డుపడ్డారని కూడా విమర్శించారు.
ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కుల, మత అంశాలపై వాగ్వాదం ముదిరింది. అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
