జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిని ORR (ఔటర్ రింగ్ రోడ్) వరకు విస్తరించడంతో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గతంలో ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా, 30 సర్కిల్స్‌ను 60 సర్కిల్స్‌గా పెంచుతూ అధికారికంగా నిర్ణయం ప్రకటించింది.
నగర విస్తీర్ణం భారీగా పెరగడం, జనాభా అధికమవడం, పౌర సమస్యలు వేగంగా పరిష్కరించాల్సిన అవసరం నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. జోన్లు, సర్కిల్స్ పెంచడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలన అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ జోన్లకు సంబంధించిన కొత్త జోన్ కార్యాలయాలు ఆయా సర్కిల్ ఆఫీసులలోనే ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా పరిపాలనా వ్యయాన్ని తగ్గించడంతో పాటు పనితీరును వేగవంతం చేయనున్నారు.
ఈ మార్పులతో మున్సిపల్ సేవలు మరింత మెరుగుపడతాయని, రోడ్లు, డ్రైనేజీ, శుభ్రత, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కూడా ఫిర్యాదుల పరిష్కారం సులభంగా, వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
